Saturday, May 3, 2025

మహాభారతం - ఆదిపర్వం - కనిక నీతి

 

మహాభారతంలో ధృతరాష్ట్రుడు, పాండురాజు అన్నదమ్ములు. ధృతరాష్ట్రుని నూరుగురు కుమారులు, కౌరవులు, పాండురాజు ఐదుగురు కుమారులు పాండవులు ముఖ్యపాత్రధారులు. కౌరవులకి, పాండవులకి చిన్నతనం నుండే వైరం ఉండేది. పాండవులు ధర్మానికి కట్టుబడి, పెద్దల మాటలకి గౌరవం ఇచ్చి తమ పరిధి దాటకుండా నడుచుకునేవారు. కౌరవులు పాండవులని ఇబ్బంది పెడుతూ ఉండేవారు. కౌరవులలో పెద్దవాడు దుర్యోధనుడు దుర్మార్గపు ఆలోచనలతో ఉండేవాడు.

యుక్తవయస్కులైన రాకుమారుల అస్త్రవిద్యా ప్రదర్శన తరువాత ధృతరాష్టుడు పెద్దవాడైన ధర్మరాజుకు యువరాజు పట్టాభిషేకం చేసాడు.  తనకన్నా పెద్దవాడు, అన్నవరసైనవాడు అయిన ధర్మరాజుకు న్యాయంగా ధర్మంగా దుర్యోధనుడు కట్టుబడి ఉండాలి. తమ్ముడిగా సేవించాలి. అప్పటివరకూ పాండవులలో తన బల పరాక్రమాలలో సరిజోడైన భీముని చంపెయ్యాలన్న ఆలోచనతో ఎప్పుడూ వుండే దుర్యోధనుడు ఇప్పుడు ధర్మరాజు యువరాజు స్థానంలో వుండటం ససేమిరా నచ్చక, తాను రాజు అవ్వాలన్న కోరిక బలీయంగా ఉండటంతో, ధర్మ రాజుని ఒక శత్రువుగా భావిస్తూ ఆయనని చంపాలని ఆలోచనతో, తన భవనంలో ఒక సమావేశం ఏర్పాటు చేసాడు. ఆ సమా వేశానికి తన మద్దతుదారులు, ఆప్తులూ అయిన తమ్ముడు సుశ్శాసనుని, మిత్రుడు కర్ణుని, మేనమామ గాంధార దేశ రాజు శకునిని పిలిచాడు.

యువరాజు పదవిలో శాస్త్రోక్తంగా పెద్దల ఆశీర్వాదంతో వున్న ధర్మరాజుని చంపటం అధర్మం. అందుకని దుర్యోధనుడు రాజనీతిలో శత్రువుని తుదముట్టించే ఆలోచన చస్తూ సమావేశానికి వచ్చిన వారి అభిప్రాయాలు అడిగాడు.  

నన్నయ్య గారు రాసిన ఆంధ్ర మహాభారతంలో కనికుడు, శకునికి మంత్రి, దుర్యోధనుని ప్రశ్నకి సమాధానం చెప్పాడు. వేద వ్యాసుడు వ్రాసిన సంస్కృత మహాభారతంలో ధృతరాష్టుడు ఈ విషయం మాట్లాడినట్టుగా ఉంటుంది

దుర్యోధనుని  ప్రశ్న – రాజనీతి ద్రుష్టిలో శత్రువు మీద దాడి వ్యూహంలో రాజులకి ఏది న్యాయం?

సమావేశంకి శకునితో పాటు వచ్చిన గాంధారదేశ మంత్రి కనికుడు ఇలా సమాధానం చెప్పాడు.

  • రాజు ఏదన్నాచెయ్యాలని అనుకున్నప్పుడు వెంటనే చేయకూడదు. అనుభవజ్ఞుల దగ్గర అది పెద్దవారవ్వచ్చు లేదా మంత్రులు అవ్వచ్చు లేక సలహాదారులు అవ్వచ్చు, వారితో సంప్రదించి, చర్చించి, విశ్లేషించి, మంచి చెడ్డలు ఆలోచించి,  నిర్విఘ్నంగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా చేయాలి.  
  • ప్రజలు ఒక శాసనం నిబద్ధతతో పాటిస్తున్నారు అంటే, ఆ దేశ రాజుగారు దండనీతిని చక్కగా అమలుపరుస్తున్నాడని అర్ధం.  
  • దండనీతి అంటే ఎప్పుడు, ఎవరికి, ఎలాంటి పనికి, ఎటువంటి దండన విధించటం అనెడిది స్పష్టంగా తర్కానికి తావు లేకుండా విధించటం. రాజు ఇది పాటించినప్పుడు ఏ వర్ణం వాళ్ళు చేయాల్సిన పనిని ఆ వర్ణం వాళ్ళు సరిగ్గా చేస్తారు.  అందరూ కూడా సమ బుద్ధితోటి రాజుని అనుకరిస్తారు. 
  • రాజు తన బలహీనతలను ఎవరితోటి చెప్పకూడదు. కానీ, అవతలివారి బలహీనతలని తప్పకుండా తెలుసుకుంటూ ఉండాలి. 
  • శత్రువు రోజురోజుకీ బలవంతుడు అవుతున్నాడు, బలం పుంజుకుంటున్నాడు, వృద్ధిలోకి వస్తున్నాడు అంటే, వెంటనే ముందు ఆ శతృవుని తుదముట్టించాలి. ఇది రాజనీతి. 
  • మొక్కై వంగనిది మానై వంగుతుందా అని,  మొదట్లో ఉన్నప్పుడే శత్రువు అని గమనించగానే ఆ శత్రువు నుంచి ఆపద పొంచి ఉంది అని ఊహకి తెలియగానే ఆ శత్రువుని చంపేసేయాలి. 
  • చిన్నవాడైనా, తనకన్నా బలహీనుడైనా శత్రువు అన్న వారిని రాజు వదలకూడదు. 
  •  శత్రు శేషం ఉండకూడదు అని ఆలోచన చేసే రాజు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 
  • విహారానికి కానీ,  కొండమీదికి కానీ,  ఉద్యానవనానికి కానీ, సభలకి కానీ,  పుణ్యక్షేత్రాలకీ  తీర్థాలకి కానీ,  వెళ్ళాలని అనుకొంటే, రాజు గారి ముందు ఆయన రక్షణ యంత్రాంగం కదిలి, రక్షక భటులు వెళ్ళి ఆ చోటుని బాగా పరిశీలించి, వెతికి ఆయనకు ఎటువంటి భయం లేదని తీర్మానించిన తరువాతనే రాజుగారు ఆ చోటికి వెళ్ళాలి. 
  •  రాజు కోపానికి వచ్చే ఫలితం ఎదుటి వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాకూడదు తెలియకూడదు. 
  •       అలాగే ప్రేమకి ఫలితం కూడా తెలియకూడదు. 
  • రాజు ఎప్పుడు ఎవరి మీద కోపంగా ఉన్నాడో, ఎవరి మీద ప్రేమగా ఉన్నాడో, వారికి ఎటువంటి దండన విధిస్తారో లేకపోతే ఎటువంటి అభిమానం చూపెడతాడో తెలియకూడదు. 
  • శత్రువు తోటి కలిసి తిరిగేటప్పుడు అతని మీద రాజుకి కక్ష ఉందని కానీ, కోపం ఉందని కానీ తెలియకూడదు. 
  • శత్రువు పక్కనే ఉన్నప్పుడు ఏమరుపాటుగా ఉండడం తగదు. అప్పుడు ఆ రాజు పరిస్థితి చెట్టు చిటారు కొమ్ము మీద ఆదమరిచి నిద్రపోతున్న వాడి పరిస్థితి.   
ద్వాపర యుగంలో కనికుడు
 చెప్పిన ఈ మాట దుర్యోధనుని దుర్మార్గపు ఆలోచనకీ,  ప్రవర్తనకీ రాజనీతి శాస్త్ర  ముసుగు కప్పింది. కలియంగంలో ఈ కనికనీతి అధర్మమైన నడవడికకి  ఒక ఆసరాగా మారింది. 

 ప్రేరణ: గురుతుల్యులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి మహాభారత ప్రవచనం.

c