మహాభారతం ఒక ఇతిహాసం.
ఇందులో ముఖ్య ఘట్టం కురుక్షేత్ర సంగ్రామం. ధర్మ యుద్ధం. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొన్న మహాయోధులు, పాత్రలు కారణ జన్ములు. కృష్ణుడు సాక్షాత్తు పరమాత్మ అయితే, కొందరు అయోనిజలు, ఇంకొందరు దైవాంశసంభూతులు, మరికొందరు ఆ యుద్జధం కోసం మటుకే పుట్టిన వారు. వారందరూ ఆ సమయంలో కురుక్షేత్రంలోకి అడుగు పెట్టడానికి పుట్టిన వారే. ద్వాఫర యుగ అధర్మ వినాశనానికీ జగన్మాత కదిపిన పావులు, సృష్టించిన సంఘటనలు మనిషి ఊహకు అందనివి. శంతనుడు గంగను కలవటం, అష్ట వసువుల శాపం, మత్స్యగంధి జననం, పరాశర మహర్షి మత్స్యగంధి ద్వారా వేదవ్యాసుని జననం, అంబ శపధం, రాజభోగాలు అనుభవించే గాంధారి మనసులో అసూయ, ద్రౌపది ఆవిర్భావం . . . ఇలా కాల చక్రంలో సంభవించిన అనేక సంఘటనలు, జీవితాలు, చివరకు
కురుక్షేత్రం చేరటం, అంతా జగన్మాత సంకల్పం. కొన్ని పుటుకలు అసంభవంగా అనిపిస్తాయి, కొన్ని సంఘటనలు ఆశ్చర్యంగా ఉంటాయి. అన్నిటి ప్రయాణం ధర్మ సంస్ధాపన వైపే. ధర్మ సంస్ధాపన కోసమే. ధర్మ సంస్ధాపనే లక్ష్యం.
= = = = = = = = = = = = = = = = = = = = =
గౌతమ మహర్షి కుమారుడు శరద్వందుడు. ఆయన పుట్టినప్పుడు ఈయనతోపాటు బాణ సమూహం పుట్టాయి. శరద్వందుడు బ్రాహ్మణుడు అయినా వేదాధ్యాయనం చేయక, ధనుర్వేదం మీద విపరీతమైన ప్రీతితో అదే అభ్యసించాడు. ధనుర్వేదం వివిధ ఆయుధాల గురించి, వాటిని ప్రయోగించే తీరు గురించి, యుద్ధ కళల గురించి వివరిస్తుంది.
శరద్వందుడు తాను నేర్చుకున్నదానితో తృప్తి చెందక, ఙ్ఞానోపార్జన కాంక్షతో తపస్సు చేయ మొదలు పెట్టాడు. ఆ సమయంలో జలపద అనే అప్సరస ఆ ప్రాంతానికి రావటం జరిగింది. నిష్టగా, బ్రహ్మచర్యంతో, ఘోర తపస్సులో ఉన్న శరద్వందుడు ఆమెను చూసాడు. ఆయన మనస్సు ఒక్క క్షణం చలించింది. మరుక్షణం ఆయన వీర్యం స్ధలించింది.
మనుష్యు లోకంలో పురుషుడి వీర్యం స్త్రీ గర్భంలో అండంగా రూపు దిద్దుకుంటుంది. కానీ, ఒక మహత్తర కార్యంలో ఒక పాత్ర పోషించడానికి ఒక మహానుభావుని సంతతి అవసరమైనప్పుడు స్త్రీ సంభోగం లేకుండానే ఆయన సంతానోత్పత్తి ఒక వింత పద్ధతిలో జరుగుతుంది. ఇది పరాశక్తి ఇఛ్ఛ.
స్ధలించిన శరద్వందుని వీర్యం రెల్లు గడ్డి మీద పడి, రెండు భాగాలయ్యింది. శరద్వందుడు తన ధనుర్బాణాలు, జింక చర్మం ఆక్కడనే వదిలేసి, వెళ్ళిపోయాడు. భగవత్సంకల్పంతో ఆయన వీర్యం కాలక్రమేణ ఒక మగ పిల్డవాడిగా, ఒక ఆడపిల్లగా రూపు దిద్దుకున్నాయి. ఆ సమయంలో వేటకు అటుగా వచ్చిన శంతన మహారాజు ఆ పిల్లల్ని, వారి పక్కన వున్న ధనుర్బాణాలు, జింక చర్మం చూసి, వారి పుటుక గొప్ప వంశంలో అని తలచి, వారికి కృప, కృపి అని పేర్లు పెట్టి తన అంతఃపురంలోనే పెంచి పెద్ద చేసాడు. కృప తన తండ్రి శరద్వందుని వద్ద ఆయుర్వేదం నేర్చుకున్నాడు.
తరువాతి కాలంలో కృప పాండవులకు కౌరవులకూ మొదటి గురువై ఆచార్య పదవి పట్టి, కృపాచార్యుడు అయ్యాడు. కురుక్షేత్ర యుద్ధం లో కౌరవుల వైపు నిలిచి పోరాడాడు. కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిదవ రోజు రాత్రి అశ్వత్థామ తో కలిసి పాండవ సేన గుడారాలకు నిపప్పు పెట్టి వారిని హతమార్చాడు. యుద్ధం తరువాత ధర్మరాజు కొలువులో మంత్రిగా ఉన్నాడు. పాండవులు స్వర్గారోహణకు వెళ్ళేటప్పుడు అర్జునుని మనవడు, అభిమన్యుని కొడుకైన పరీక్షిత్తుని కృపాచార్యుని సంరక్షణలో వదిలి వెళ్ళారు.
కృపాచార్యుడు చిరంజీవి.